Published On 5 Oct, 2021
కాలేశ్వరం సొరంగాలు తవ్వడానికి లక్షల కోట్లు ఖర్చు పెడుతున్న కేసీఆర్: MP Dharmapuri Arvind
Dharmapuri Arvind Comments On cm kcr

దక్షిణ మధ్య రైల్వే పరిధిలో గల ఎంపీలతో రైల్ నిలయంలో రైల్వే జీఎం గజానన్ మాల్యా ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గోనడం జరిగింది. ఈ సమావేశంలో ముందుగా గత రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ , ఇప్పుడు కొత్తగా రైల్వే శాఖ మంత్రి గా నియమితులైన అశ్విని వైష్ణవ్ గారికి శుభాకాంక్షలు తెలియచేశాము. ఇక అన్ని డివిజన్లకు సంబంధించిన అధికారులు పాల్గొన్న ఈ సమావేశంలో నిజామబాద్ పార్లమెంటు పరిధిలో ఉన్న పలు పెండింగ్ అంశాలపై జీఎం కలిసి సమీక్ష చేశాము . ప్రస్తుతం నడుస్తున్న కరీంనగర్ – తిరుపతి రైలును నియోజకవర్గంలోని జగిత్యాల, కోరుట్ల, ఆర్మూర్ ల మీదుగా నిజామాబాద్ వరకు పొడిగించాలని చేసిన విజ్ఞప్తిపై జీఎం సానుకూలంగా స్పందించారు. దక్షిణ మధ్య రైల్వే ఈ ఫైల్ ను రైల్వే బోర్డు అనుమతి కోసం పంపించడం జరిగిందన్నారు. నిజామాబాద్ నుంచి ఢిల్లీ , ముంబయి వరకూ కనెక్టివిటీ కోసం కూడా అధికారులను అడగడం జరిగింది. ఢిల్లీ, ముంబయిలలో కొత్త టర్మినల్స్ నిర్మాణం లో ఉన్నాయని అవి పూర్తయిన వెంటనే తప్పకుండా ఏర్పాటు చేస్తామని అధికారులు చెప్పిన విషయాన్ని లిఖిత పూర్వకంగా ఇమ్మని అడగడం జరిగింది.

మరో వైపు 2019 అక్టోబర్ వరకే కేంద్ర ప్రభుత్వం నుంచి అన్ని అనుమతులు, నిధులు మంజూరు చేయించినా రాష్ట్ర ప్రభుత్వం టెండరింగ్ ప్రక్రియ ప్రారంభించక పోవడంతో పెండింగ్లో ఉన్న మాధవనగర్ ఆర్వోబీ నిర్మాణాన్ని వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించడం జరిగింది.

అదే విధంగా బోధన్, అర్సపల్లిల వద్ద కూడా ఆర్వోబీల నిర్మాణాలను చేపట్టాల్సి ఉందని, దానికి తగు విధంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం పై ఒత్తిడి చేసి పనులు వేగంగా పూర్తయ్యేలా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించడం జరిగింది. ఆర్మూర్, గోవింద్ పేట్, మామిడి పల్లి ల వద్ద పూర్తిగా వంద శాతం రైల్వే నిధుల ద్వారా నిర్మిస్తున్న ఆర్వోబీల నిర్మాణ పనులు కూడా చాలా నెమ్మదిగా కొనసాగుతుండడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. పనులు త్వరగా పూర్తయ్యేలా కాంట్రాక్టర్ల పై ఒత్తిడి తీసుకురావాలని సూచించారు.

కోరుట్ల, మెట్పల్లి, ఆర్మూర్, రైల్వే స్టేషన్లకు సరైన అప్రోచ్ రోడ్లు నిర్మించాలని కూడా అడగడం జరిగింది దీని పై రైల్వే అధికారులు సానుకూలంగా స్పందించారు. ప్రస్తుతం నిజామాబాద్ నుండి దిమాపూర్ వరకూ నడిచే గూడ్స్ రైలు మార్గం 3077 కి.మీ లు ఉందని ,దీని వల్ల రైతులపై ఆర్దిక భారం పడుతోందని దీన్ని కరీంనగర్ మీదుగా నడిపితే సుమారు 400 కి.మీ ల దూరం తగ్గుతుందని కూడా సూచించాము. ఈ సూచనను రైల్వే బోర్డు దృష్టికి తీసుకెళ్తామని దక్షిణ మద్య రైల్వే జీఎం పేర్కొన్నారు. కోవిడ్ కారణంగా పలు ప్యాసింజర్ రైళ్లు రద్దయ్యాయని, వాటిని పునః ప్రారంభించాలని, పెద్దపల్లి- నిజామాబాద్ రైల్వే మార్గంలో విద్యుద్దీకరణ పనుల పురోగతి పై రేల్వే అదికారులను ప్రశ్నించగా మోర్తాడ్ వరకూ పనిపూర్తయిందని అధికారులు సమాధాన మిచ్చారు.

ఇలా మొత్తం 22 అంశాలను రైల్వే అధికారుల ముందు ఉంచడం జరిగింది. అలాగే ఈ సమావేశాన్ని ఆర్నెళ్లకోసారి కాకుండా మరింత తరచుగా నిర్వహించాలని తద్వారా స్థానిక సమస్యలను మరింత త్వరగా అధికారుల దృష్టికి తీసుకురావడానికి అవకాశం ఉంటుందని కూడా సూచించడం జరిగింది.

ఇక ఈ సమావేశంలో రైల్వే అధికారుల సమాధానాలు గమనిస్తే రాష్ట్రం లో 99 శాతం రైల్వే ప్రాజెక్టులు అగిపోవడానికి కారణం రాష్ట్ర ప్రభుత్వం తన వంతు నిధులు కేటాయించక పోవడమే కారణంగా తెలుస్తోంది. కాలేశ్వరం సొరంగాలు తవ్వడానికి లక్షల కోట్లు ఖర్చు పెడుతున్న కేసీఆర్ ప్రభుత్వం లక్షల మంది ప్రజల ప్రయాణ సౌకర్యానికి ఉపయోగపడే రైల్వే లకు వందల కోట్లు కూడా కేటాయించ లేక పోతోంది. కేసీఆర్ చెప్తున్నట్టు తెలంగాణ ధనిక రాష్ట్రం అయితే వెంటనే రైల్వే ప్రాజెక్టులకు నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నాం..

Related Posts